అధ్యాత్మ సంకీర్తన
రేకు: 146-4
సంపుటము: 2-209
రేకు: 146-4
సంపుటము: 2-209
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| ఇదియే కావలెనని తాఁ గైకొని యిచ్చగించువాఁడే ఘనుఁడు వదలకురో హరిదాసుల మతమిది వర్ణించెద నో వివేకులాలా | ॥పల్లవి॥ |
| దేవుఁడు గలఁడని మదిలోఁ దెలియుటే జన్మఫలంబు తావుగ నాతని నెప్పుడుఁ దలఁచుటే తనభాగ్యము శ్రీవైష్ణవధర్మము దప్పక చెలఁగుటయే వైభవము దేవతాంతరంబులన్నియు మానినదియే సుకృతంబు | ॥ఇది॥ |
| కామక్రోధము లుజ్జగించుటయే కల్యాణానుభవము చేముంచి పాపము సేయక మానుటే చెప్పఁగ లాభము నేమముతోడుత విరక్తుఁడగుటే నిర్మలానందము వేమరు నాచార్యసేవ సేయుటే విచారింపఁగ దాఁచిన ధనము | ॥ఇది॥ |
| ప్రకృతివికారములకుఁ జొరకుండుటే పరమమైన సాత్వికము సకలబంధములఁ బెడఁ బాసినదే సామ్రాజ్యపదము ప్రకటింపఁగ నలమేలుమంగకును పతియగు శ్రీవేంకటవిభుని అకలంకుఁడై కొలిచియుండుటే యనంతమహిమాతిశయంబు | ॥ఇది॥ |


