Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 146-5
సంపుటము: 2-210
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కేదారగౌళ
ఇదియే ఉపాయ మిఁక నాకు నిందులకంటే మఱి లేదు
మది నితని దాసులదాసుఁడనై మహిమలతోఁ గడుమెఱసేఁ గాక
॥పల్లవి॥
కడచితినా నాజన్మములు గక్కన మానిసినైనంతనే
విడిచితినా పాపము సేయక వేవేలుచదివినయంతనే
అడఁచితినా సంసారవారధి అఖిలదేవతలఁ గొలిచినయంతనే
బడిబడి హరినామము నుతించి నేఁ బావనమయ్యేఁ గాక
॥ఇది॥
గెలిచితినా యీమాయను నేఁ గెరలి తపంబులు నేసినంతనే
తలఁగితినా నరకములు చొరక ధరయెల్లా నేలినంతనే
తెలిసితినా తత్త్వరహస్యము తిరముగ కులజుఁడనయినంతనే
యిలలో శ్రీపతి శరణుచొచ్చి నేనిన్నిటఁ బుణ్యుఁడనయ్యేఁ గాక
॥ఇది॥
వదలితినా నాదుర్గుణములు వరుసతోఁ జుట్టాలు గలిగినంతనే
వెదకితినా ముక్తిమార్గమును విద్య లెఱిఁగి నేర్చినంతనే
యిదివో శ్రీవేంకటేశుఁడు నాకును యేలికయై మన్నించఁగను
పదిలముగా నాతనిసేవచేసి పరమానందుఁడనయ్యేఁ గాక
॥ఇది॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము