అధ్యాత్మ సంకీర్తన
రేకు: 147-2
సంపుటము: 2-212
రేకు: 147-2
సంపుటము: 2-212
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
| మహి నుద్యోగి గావలె మనుజుఁడైనవాఁడు సహజివలె నుండేమీ సాధింపలేఁడు | ॥పల్లవి॥ |
| వెదకి తలచుకొంటే విష్ణుఁడు గానవచ్చు చెదరి మఱచితే సృష్టి చీఁకటౌ పొదలి నడచితేను భూమెల్లా మెట్టి రావచ్చు నిదిరించితేఁ గాలము నిమిషమై తోఁచు | ॥మహి॥ |
| వేడుకతోఁ జదివితే వేదశాస్త్రసంపన్నుఁడౌ జాడతో నూరకుండితే జడుఁడౌను వోడక తపసియైతే వున్నతోన్నతుఁడౌ కూడక సోమరియైతే గుణహీనుఁడౌను | ॥మహి॥ |
| మురహరుఁ గొలిచితే మోక్షము సాధించవచ్చు వెరవెఱఁగకుండితే వీరిడియౌను శరణంటే శ్రీవేంకటేశ్వరుఁడు రక్షించును పరగ సంశయించితే పాషండుఁడౌను | ॥మహి॥ |


