Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 147-3
సంపుటము: 2-213
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కేదారగౌళ
తనలోనుండిన హరి దాఁ గొలువఁడీ దేహి
యెనలేక శరణంటే నితఁడే రక్షించును
॥పల్లవి॥
కోరి ముదిమి మానుపుకొనే యాస మందులంటా
వూరకే చేఁదులు దిన నొడఁబడును
ఆరూఢి మంత్రసిద్ధుఁడనయ్యేననే యాసలను
ఘోరపుఁబాట్లకు గక్కున నొడఁబడును
॥తన॥
యిట్టె యక్షిణిఁ బంపు సేయించుకొనే యాసలను
వొట్టి జీవహింసలకు నొడఁబడును
దిట్టతనముఁ దా నదృశ్యము సాధించే యాస
జట్టిగ భూతాలఁ బూజించఁగ నొడఁబడును
॥తన॥
చాపలపు సిరులకై శక్తిఁ గొలిచే యాసను
వోపి నిందలకు నెల్లా నొడఁబడును
యేపున శ్రీవేంకటేశుఁ డేలి చేపట్టినదాఁకా
ఆఁపరాని యాస నెందుకైనా నొడఁబడును
॥తన॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము