Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 147-6
సంపుటము: 2-216
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవి
కలశాపురముకాడఁ గాచుకున్నాఁడు
వలసిన వరాలిచ్చీ వాయునందనుఁడు
॥పల్లవి॥
మాయాబిలము చొచ్చి మగుడి యంబుధిలోని-
చాయాగ్రహముఁ జంపి చయ్యన దాఁటి
ఆయెడ లంకిణిఁ గొట్టి యంతలో జానకిఁగని
వాయువేగాన వచ్చిన వాయునందనుఁడు
॥కల॥
కడలిదరినుండిన కపులతోఁ గూడికొని
వడదీరఁగా మధువనము చొచ్చి
బడి రామునికి సీతాపరిణామ మెల్లాఁ జెప్పె
వడిగలవాఁడితఁడు వాయునందనుఁడు
॥కల॥
రావణాదిరాక్షసుల రామునిచే సాధింపించి
ఆవిభుని సీతఁ గూర్చి అయోధ్య నుంచె
శ్రీవేంకటేశుఁ గొల్చి శిష్టరక్షణమునకై
వావిరి నిలుచున్నాఁడు వాయునందనుఁడు
॥కల॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము