Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 148-1
సంపుటము: 2-217
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళిరామక్రియ
వసుధఁ జూడ బిన్నవానివలె నున్నవాఁడు
వెస నన్నివిద్యలాను వెలసె విట్ఠలుఁడు
॥పల్లవి॥
పరగ నేడు నూటడెబ్బదియేడుగురిచేత-
నిరవై పాడించుకొన్నాఁడీ విట్ఠలుఁడు
సరుస నైదులక్షలిండ్ల జవ్వనపు గొల్లెతల
మరిగించుకొన్నవాఁడు మరి యీ విట్ఠలుఁడు
॥వసు॥
బత్తితోడ తనమీఁది పాటలు వాడితేను
యిత్తల మోమై తిరిగె నీ విఠలుడు
హత్తి తన్నొల్లకపోఁగా నందరి మేడ దేవళ్ళ
యెత్తి పాదాలందు జూపె నితఁడే విట్ఠలుఁడు
॥వసు॥
గట్టిగాఁ బుండరీకుఁడు కడువేడుకఁ బెట్టిన-
యిట్టిక పీఁటపై నున్నాఁడీ విఠలుడు
అట్టితానే శ్రీవేంకటాద్రిఁ బాండురంగమున
యెట్టుగొల్చినా వరములిచ్చీ విట్ఠలుఁడు
॥వసుధఁ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము