అధ్యాత్మ సంకీర్తన
రేకు: 149-2
సంపుటము: 2-224
రేకు: 149-2
సంపుటము: 2-224
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది
| ఏమని విన్నవింతు నిదివో నా భాగ్యము కామించి మీ శరణంటిఁ గమలారమణా | ॥పల్లవి॥ |
| కలది యందరికైతేఁ గర్మఫలము కెలన నాకైతే నీకృపాఫలము అల సురలకు మథితామృతము నెలకొన్న నాకైతే నీనామామృతము | ॥ఏమ॥ |
| సకలాత్మల బ్రదుకు సంసారమూలము ప్రకటించ నాకైతే నీ పాదమూలము వెకలి లోకులరతి వీథివీథిని నా- త్రికరణరతి నీదివ్యభావవీథిని | ॥ఏమ॥ |
| రంగుగ బాంధవ మందరకు బంధుజనులందు సంగతి నాకు నీ భక్తజనులయందు అంగవించి శ్రీవేంకటాధిప నన్నేలితివి చెంగట నా ధ్యానము నీ శ్రీమూర్తియందు | ॥ఏమ॥ |


