Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 149-4
సంపుటము: 2-226
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
శరణన్న విభీషుణుఁ గరుణఁ గాచినవాఁడు
పరికింపఁ దారకబ్రహ్మమా యీరాముఁడు
॥పల్లవి॥
ఆలికై విల్లువిఱిచి వాలికై యమ్మువేసిన-
వాలుమగఁటిమిగలవాఁడా వీఁడు
ఱాలను జలధిగట్టి కేలను మోక్షమిచ్చి
యేలేను జటాయువును యీతఁడా రాముఁడు
॥శర॥
మింటికట్లు దెగనేసి యంటి పగసాధించి
దంటరాకుమారుఁడు తా నీశూరుఁడా
బంటుగా వాయుజు నేలి నంటు సుగ్రీవుతోఁ జేసి
కంటకరావణవైరి ఘనుఁడా యీరాముఁడు
॥శర॥
రాకాసుల మర్దించి కాకాసురు నటు గాచి
మైకొన్న జానకీరమణుఁ డితఁడా
యీకడ శ్రీవేంకటాద్రి నిరవై తాను నున్నాఁడు
దీకొన్న ప్రతాపపుఁ దేవుఁడా యీరాముఁడు
॥శర॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము