Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 149-5
సంపుటము: 2-227
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
మిన్నునేలా నొక్కటైన మేటితేరు
కన్నులపండువయిన శ్రీకాంతునితేరు
॥పల్లవి॥
జలధులమీఁదను చక్కఁగా నేఁగెను తేరు
బలిమిఁ గులాద్రుల పైఁ బారెను తేరు
పెలుచు లంకముంగిట పేరెలువారెను తేరు
చెలఁగె దిగ్విజయపు శ్రీహరితేరు
॥మిన్ను॥
రమణఁ గుండిననగరము చుట్టుకొన్న తేరు
తిమురుచు రుకుమిణిఁ దెచ్చిన తేరు
సమరములో జరాసంధునిఁ దోలిన తేరు
అమరుల వెనుబలమగు శౌరితేరు
॥మిన్ను॥
వొట్టి సృగాలవాసుదేవుని భంగించిన తేరు
బెట్టుపౌండ్రకునిపై దాడివెట్టిన తీరు
అట్టె శ్రీవేంకటుశుఁ డలమేలుమంగఁ గూడి
పట్టమేలుచు నెక్కిన పరమాత్ము తేరు
॥మిన్ను॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము