అధ్యాత్మ సంకీర్తన
రేకు: 150-1
సంపుటము: 2-229
రేకు: 150-1
సంపుటము: 2-229
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాట
| దానవారితోడి పగ ధరించరాదు మీకు కానుకిచ్చి శరణని కప్పము లియ్యరో | ॥పల్లవి॥ |
| భ్రమసి వార్ధిఁబడ్డాను పాతాళము దూరినాను సమయింపక మానఁడు శత్రులార రమణ భూమిచొచ్చిన బ్రహ్మచే వరముగొన్న తమిఁ జంపక మానఁడు దై తేయులాల | ॥దాన॥ |
| రాసి మిన్నులో దాఁగిన రాచమూకలలోనున్న కోసివేసీఁ దల లరి కుమతులాల ఆసఁ ద్రికూటమెక్కినా ఆచక్రవాళమంటినా తోసి సాధించకపోఁడు దుర్మతులాల | ॥దాన॥ |
| సతుల మాఁటుననున్నా సరి నెందెందు వోయినా రతి మెట్టక మానఁడు రాకాసులాల యితఁడు శ్రీవేంకటేశుఁ డెదురులేదితనికి గతియని మొక్కరో వో కపటులాల | ॥దాన॥ |


