అధ్యాత్మ సంకీర్తన
రేకు: 151-1
సంపుటము: 2-235
రేకు: 151-1
సంపుటము: 2-235
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాక్షి
| ఎంచి చూడరో ఘనులార యిందీవరాక్షుఁడు రక్షకుఁడు సంచితముగ నితని శరణంటే సర్వఫలప్రద మిందరికి | ॥పల్లవి॥ |
| హరిఁ గొలువని కొలువులు మఱి యడవిఁగాసిన వెన్నెలలు గరిమల నచ్చుతు వినని కథలు భువి గజస్నానములు పరమాత్మునికిఁ గాని తపంబులు పాతాళముల నిధానములు మరుగురునికిఁ గాని పూవులపూజలు మగఁడులేని సింగారములు | ॥ఎంచి॥ |
| వైకుంఠుని నుతియించని వినుతులు వననిధిఁ గురిసిన వానలు ఆ కమలోదరుఁ గోరనికోరికె లందని మానిఫలంబులు శ్రీకాంతునిపైఁ జేయని భక్తులు చెంబుమీఁది కనకపుఁబూఁత దాకొని విష్ణుని తెలియని తెలువులు తగ నేటినడిమి పైరులు | ॥ఎంచి॥ |
| వావిరిఁ గేశవునొల్లని బదుకులు వరతఁ గలపు చింతపండు గోవిందుని కటు మొక్కని మొక్కులు గోడలేని పెనుచిత్రములు భావించి మాధవుపై లేనితలఁపులు పలు మేఘముల వికారములు శ్రీవేంకటపతికరుణ గలిగితే జీవుల కివియే వినోదములు | ॥ఎంచి॥ |


