Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 152-5
సంపుటము: 2-244
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
ఈ రూపమై వున్నాఁడు యీతఁడే పరబ్రహ్మము
శ్రీరమాదేవితోడ శ్రీవేంకటేశుఁడు
॥పల్లవి॥
పొదలి మాయాదేవిపట్టిన సముద్రము
అదె పంచభూతాలుండే అశ్వత్థము
గుదికొన్న బ్రహ్మాండాల గుడ్లఁ బెట్టే హంస
సదరపుబ్రహ్మలకు జలజమూలకందము
॥ఈరూ॥
అనంతవేదాలుండేటి అక్షయవటపత్రము
ఘనదేవతలకు శ్రీకరయజ్ఞము
కనలు దానవమత్తగజసంహారసింహము
మొనసి సంసారభారము దాల్చేవృషభము
॥ఈరూ॥
సతతము జీవులకు చైతన్యసూత్రము
అతిశయభక్తుల జ్ఞానామృతము
వ్రతమై శ్రీవేంకటాద్రి వరముల చింతామణి
తతిగొన్న మోక్షపు తత్త్వరహస్యము
॥ఈరూ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము