అధ్యాత్మ సంకీర్తన
రేకు: 153-2
సంపుటము: 2-247
రేకు: 153-2
సంపుటము: 2-247
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది
| ఐనట్టయ్యీఁ గాక హరికల్పితము లివి మానేటి వేఁటివో మానని వేవో | ॥పల్లవి॥ |
| వొక్కరు తలఁచినట్టు వొకరి తలఁపు రాదు పక్కన నందరికి బహుభావాలు అక్కట మొద లొకటి అనలుఁ గొనలు వేరు యెక్కడని తగిలేది యేమిసేసేది | ॥ఐన॥ |
| పొరుగువాని చేఁత ఆపొరుగువాఁడు మెచ్చఁడు నరుల కర్మములు నానావిధాలు గరిమ నన్నమొక్కటే కడుపుతనివి వేరు కరుణించౌనన నేవి కావన నేవి | ॥ఐన॥ |
| కడఁగి దరిద్రునిమాట కలవాని కింపుగాదు బెడఁగు జీవుల పొందు పెక్కురీతులు కడు శ్రీవేంకటేశుఁ డొక్కఁడు జగత్తులు వేరు వొడిఁగట్టుకొనే దేది వొల్లననే దేది | ॥ఐన॥ |


