అధ్యాత్మ సంకీర్తన
రేకు: 153-3
సంపుటము: 2-248
రేకు: 153-3
సంపుటము: 2-248
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాట
| నిండె నిన్నిచోటులను నీమహిమలే అండనే మొక్కేము నీకు నాదినారసింహా | ॥పల్లవి॥ |
| కూరిమి యిందిరమీఁద కోపము అసురమీఁద తారుకాణ నవ్వు దేవతలమీఁదను ఆరీతి నీకొలు విట్టే అహోబలముమీఁద నారుకొనె నీనేరుపు నారసింహా | ॥నిండె॥ |
| కరుణ ప్రహ్లాదమీఁద గన్నులు దిక్కుల మీఁద సరిచేతులు పేగుల జంధ్యాలమీఁద గరిమ నీనటనలు ఘనప్రతాపముమీఁద తిరమాయ నీకోరిక దివ్యనారసింహా | ॥నిండె॥ |
| శాంతము లోకముమీఁద శౌర్యము శత్రులమీఁద కాంతులెల్లా తనదివ్యకాయముమీఁద చింతదీర వినోదము శ్రీవేంకటాద్రిమీఁద సంతతమై నీకుఁ జెల్లె జయనారసింహా | ॥నిండె॥ |


