Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 153-4
సంపుటము: 2-249
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
అన్నిటా నీ పెంపు వింత హనుమంత నీ-
వున్న చోటు నిశ్చింత మో హనుమంతా
॥పల్లవి॥
రాముని సేనలఁగాచి రావణు గర్వమడఁచి
ఆముకొన్న బలవంత హనుమంతా
గోమున జలధి దాఁటి కొండతో సంజీవి దెచ్చి
ధీమంతుడఁవైతివింత దివ్య హనుమంత
॥అన్ని॥
చుక్కలు మొలపూసలై సూర్యమండలము మోఁచె
అక్కజపు నీ రూపంత హనుమంత
చొక్కమై మీరుండఁగాను సుగ్రీవాదులకెల్లా
అక్కర లేదించుకంతా హనుమంతా
॥అన్ని॥
జంగచాఁచి చేయెత్తి సరిఁ బిడికిలించుక
అంగము నిక్కించితెంత హనుమంత
రంగగు శ్రీవేంకటాద్రి రాముని దేవి కిచ్చితి-
వంగులియ్యక మొక్కంత హనుమంతా
॥అన్ని॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము