Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 153-6
సంపుటము: 2-251
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
ఏమి చెప్పేదిది యీశ్వరమాయలు
దీము ప్రతిమకును త్రిజగము గలిగె
॥పల్లవి॥
మలమూత్రంబుల మాంసపుముద్దకు
కులగోత్రంబుల గుఱి గలిగె
తొలులు తొమ్మిదగు తోలుఁదిత్తికిని
పిలువఁగఁ బేరును బెంపునుఁ గలిగె
॥ఏమి॥
నెత్తురునెమ్ముల నీరుబుగ్గకును
హత్తిన కర్మము లటు గలగె
కొత్తవెంట్రుకల గుబురుల గంతికి
పొత్తుల సంసారభోగము గలిగె
॥ఏమి॥
నానాముఖముల నరముల పిడుచకు
పూనిన సిగ్గులు భువిఁ గలిగె
ఆనుక శ్రీవేంకటాధిపుఁ డేలఁగ
దీనికిఁ బ్రాణము తిరముగఁ గలిగె
॥ఏమి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము