Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 154-3
సంపుటము: 2-254
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
దేవుఁడుగలవారికి దిగులుఁ జింతయు లేదు
శ్రీవిభుఁడే అన్నిటా రక్షించుఁ గనక
॥పల్లవి॥
యేలికగల బంటుకు యేవిచారము లేదు
వోలి మగఁడుగలాలికి వొప్పమి లేదు
పోళిమిఁ దండ్రిగల పుత్రుని కంగద లేదు
మేలుగాఁ బండిన భూమికిఁ గరవు లేదు
॥దేవుఁ॥
బలముగల రాజుకు భయమేమియు లేదు
కలిమిగలవాని కక్కర లేదు
యిల నాచారవంతుని కేపాపమును లేదు
తలఁపు బుణ్యముగల‌ ఆతనికిఁ జేటు లేదు
॥దేవుఁ॥
గురువుగలవానికిఁ గొఱఁత యేమియు లేదు
పరముగలవానికి భ్రాంతులు లేవు
యిరవై శ్రీవేంకటేశుఁ డిన్నిటా మాకుఁ గలఁడు
అరయ దాసులము మా కడ్డాఁకే లేదు
॥దేవుఁ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము