అధ్యాత్మ సంకీర్తన
రేకు: 154-4
సంపుటము: 2-255
రేకు: 154-4
సంపుటము: 2-255
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కేదారగౌళ
| కమలారమణ నీకల్పితపుమానిసిని తమితోడ నాదిక్కు దయఁ జూడవే | ॥పల్లవి॥ |
| ఆరీతి బ్రాహ్మణుఁడ ననుటేకాని దేహము కోరి యాచారమునకుఁ గొలుపదు పేరు వైష్ణవుఁడననే పెద్దరికమే కాని సారమైన మనసులో జ్ఞానమే లేదు | ॥కమ॥ |
| చదివితిననియెడి చలపాద మింతే కాని అదన నందులోని అర్థ మెఱఁగ పదిరిసంసారమనే బహురూపమే కాని చతురుఁదనాన నందు సమర్థుఁడఁ గాను | ॥కమ॥ |
| దేవ మీభక్తుఁడననే తేజ మొకటె కాని చేవమీర నినుఁ బూజించ నేరను శ్రీవేంకటేశ నీచేతిలోనివాఁడ నేను భావించి మఱి యేపాపము నెఱఁగను | ॥కమ॥ |


