Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 157-1
సంపుటము: 2-269
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
సత్యము సేయఁగవచ్చును సర్వేశ్వర యీమాటకు
నిత్యము నీవే యెఱుఁగుదు నేనేమి నెఱఁగఁ జుమీ
॥పల్లవి॥
సులభుఁడవౌదువు వొకమరి చూడఁగ దుర్లభుఁడవౌదువు
తలఁపింతువు మఱపింతువు తగఁ బ్రాణములోనుండి
పలికింతువు అక్షరముల పరగ నవే వ్రాయింతువు
వెలయఁగ నీవే వెలిగా వేరొకటి నేఁ జేయఁ జుమీ
॥సత్య॥
వొనరఁగఁ బూజలు గొందువు వొక్కొకపరి మానుదు వటు
కను మూయింతువు నిదురలఁ గడు మేల్కొలుపుదువు
ఘనముగ నజ్ఞానిఁ జేతువు కరుణతో జ్ఞానిఁ జేతువు
ననుఁ బుట్టించితి నీవే నా కాపని గాదు సుమీ
॥సత్య॥
నాలో నుందువు వొకపరి నగి శ్రీవేంకటగిరి నుందువు
పాలింతువు లాలింతువు భవ మీడేరింతువు
పోలింప సంసారిఁ జేతువు భువి నీదాసునిఁ జేతువు
కాలముఁ గర్మము నీవే కపటము నే నేరఁ జుమీ
॥సత్య॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము