Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 157-4
సంపుటము: 2-272
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
ఇంతకంటె నేమిసేసే మిదే మా మానసపూజ
సంతతము నీవు తొల్లే సర్వసంపన్నుఁడవు
॥పల్లవి॥
అంతర్యామివైన మీకు నావాహనమదివో
అంతటా విష్ణుఁడ మీకు నాసనము వేసినది
పంతపుఁకోనేరే మీకుఁ బలుమారు నర్ఘ్యము
చెంతనే గంగాజలముచల్లే మీకుఁ బాద్యము
॥ఇంత॥
జలధు లన్నియును నాచమనియ్యము మీకు
అల యా వరుణజల మిదియే స్నానము
వలనుగా మీమహిమలే వస్త్రాభరణములు
అల వేదములే మీకు యజ్ఞోపవీతము
॥ఇంత॥
ఇరవుగఁ గుబ్జ తొల్లిచ్చినదే మీకు గంధము
ధర మాలాకారుని పూదండలే మీకు పువ్వులు
ఉరుగతి మౌనుల హోమమే మీకు ధూపము
తిరమైన మీకు రవితేజమే దీపము
॥ఇంత॥
నానామృతములే మీకు నైవేద్యతాంబులములు
పూనిన భక్తి షోడశోచారములు
ఆనుక శ్రీవేంకటేశ అలమేల్మంగపతివి
తానకపు జపములే తగ మీకు నుతులు
॥ఇంత॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము