అధ్యాత్మ సంకీర్తన
రేకు: 157-6
సంపుటము: 2-274
రేకు: 157-6
సంపుటము: 2-274
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| భోగము నేను నీకు, భోగివి నీవు శ్రీగురుఁడ విన్నిటాను చిత్తగించు నన్నును | ॥పల్లవి॥ |
| చక్కని జన్మపు సంసారవృక్షమునకు పక్కున(వ) ఫలము నీవు భావించగా మక్కువఁ గర్మమనేటి మత్తగజమునకును యెక్కిన మావటీఁడవు యెంచఁగ నీవు | ॥భోగ॥ |
| నెట్టన దేహమనేటి నిర్మలరాజ్యమునకు పట్టమేలుచుండిన భూపతివి నీవే దిట్టమైన చిత్తమనే తేజిగుఱ్ఱమునకు వొట్టుక రేవంతుఁడవు వుపమింప నీవు | ॥భోగ॥ |
| సంతతమైన భక్తిచంద్రోదయమునకు రంతులఁ జెలఁగు సముద్రమవు నీవు చెంతల శ్రీవేంకటేశ జీవుఁడనే మేడలోన అంతర్యామివి నీవు అంకెలఁజూచినను | ॥భోగ॥ |


