అధ్యాత్మ సంకీర్తన
రేకు: 158-2
సంపుటము: 2-276
రేకు: 158-2
సంపుటము: 2-276
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గౌళ
| గట్టిగాఁ దెలుసుకొంటే కన్నదే కంటి గురుమ (తు?) దట్టమైన సుజ్ఞానము తనలోనే వున్నది | ॥పల్లవి॥ |
| బయలే పంటలు వండె బయలే పాఁడి విదికె బయలు ప్రపంచమై భ్రమయించెను బయటనే ప్రకృతియు బయటనే జీవులు బయటనే బ్రహ్మము పరిపూర్ణమాయె | ॥గట్టి॥ |
| ఆకసము చూలాయ నాకసము రూపులాయ- నాకసము సంసారమై యలవడెను ఆకసాన దివియును నాకసాన లోకములు ఆకసాన శ్రీహరి యవతారమందెను | ॥గట్టి॥ |
| అంతరంగమే భోగము అంతరంగమే యోగము అంతరంగమే అన్నిటి కావాసమయ్యే అంతరంగాన శ్రీవేంకటాధిపుఁ డున్నవాఁడు అంతరంగాన మోక్షము అతఁడే యొసఁగెను | ॥గట్టి॥ |


