Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 158-4
సంపుటము: 2-278
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
వేదములు నుతించఁగ వేడుకలు దైవారఁగ
ఆదరించీ దాసుల మోహననారసింహుఁడు
॥పల్లవి॥
నెఱులజడలతోడ నిక్కుఁ గర్ణములతోడ
కుఱుచకొమ్ములతోడ కోఱలతోడ
వుఱక సిరిఁ దొడపై నుంచక సింహాసనాన
మెఱసీఁ బ్రతాపములు మేటినారసింహుఁడు
॥వేద॥
నిడుపమీసాలతోడ నిట్టూరుపులతోడ
మిడుగుడ్లతోఁ దెల్లనిమేనితోడ
వొడలసొమ్ములు వెట్టి వొడ్డోలగమై వుండి
కడు మంచివరాలిచ్చీ ఘననారసింహుఁడు
॥వేద॥
చిలుకుగోళ్ల తోడ సెలవినవ్వులతోడ
బలు జిహ్వతోడ యోగపట్టెము తోడ
అలరి శ్రీవేంకటాద్రి నహోబలగిరిని
అల ప్రహ్లాదునిఁ గాచె నాదినారసింహుఁడు
॥వేద॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము