Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 158-5
సంపుటము: 2-279
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
సకలలోకనాథుఁడు జనార్దనుఁ డితఁడు
శుకయోగివంద్యుని సుజ్ఞాన మెంత
॥పల్లవి॥
మరుని తండ్రికిని మఱి చక్కఁదనమెంత
సిరిమగని భాగ్యము చెప్పనెంత
పురుషోత్తము ఘనత పొగడఁగ నిఁక నెంత
గరిమ జలధిశాయి గంభీర మెంత
॥సక॥
వేవేలు ముఖాలవాని నిగ్రహము చెప్ప నెంత
భూవల్లభుని వోరుపు పోలించ నెంత
వావిరి బ్రహ్మతండ్రికి వర్ణింప రాజస మెంత
యేవల్లఁ జక్రాయుధుని కెదురెంచ నెంత
॥సక॥
అమితవరదునికి ఔదార్యగుణ మెంత
విమతాసురవైరివిక్రమ మెంత
మమతల నలమేలుమంగపతి సొబ గెంత
అమర శ్రీవేంకటేశు‌ ఆధిక్య మెంత
॥సక॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము