అధ్యాత్మ సంకీర్తన
రేకు: 159-1
సంపుటము: 2-281
రేకు: 159-1
సంపుటము: 2-281
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| చంచలపడఁగవద్దు సారె సారెఁ గోరవద్దు పొంచుకున్న దైవమే బుద్ధులు నేర్పీని | ॥పల్లవి॥ |
| లోకరక్షకుఁడు నాలోననే వున్నాఁడిదే నాకు నభయములిచ్చి నన్నుఁ గాచును శ్రీకాంతుఁడీతఁడే నాచిత్తములో మలసీని దాకొని శుభములెల్లాఁ దానే వొసఁగును | ॥చంచ॥ |
| పరమపురుషుడు నాప్రాణనాథుఁడైనాఁడు పరగ నాపాలివాఁడై బ్రదికించును ధరణీశుఁ డీతఁడే నాదాపుదండై కడఁగీని నిరతి నేపొద్దును మన్నించును మమ్మెపుడు | ॥చంచ॥ |
| శ్రీవేంకటేశుఁడు నాజిహ్వఁ దగిలి వున్నాఁడు పావనునిఁ జేసి నాకు ఫల మిచ్చును గోవిందుఁ డీస్వామి నన్నుఁ గొలిపించుకొన్నవాఁడు యీవల నావల నాకు నిహపరా లిచ్చును | ॥చంచ॥ |


