Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 159-4
సంపుటము: 2-285
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
ఏఁటి జాణతనమే యేమే నీవు
కోటియైనా యాఁటది కక్కూరితికిఁ జొచ్చునా
॥పల్లవి॥
వరుసకువచ్చి యావనిత గాచుకుండఁగా
యెరవులసన్నఁ బతినేల పిల్చేవే
తెరమఱంగున నొక్కెతకు మీఁదెత్తిన మోవి
యిరవుగ నీకది యెంగిలిగాదా
॥ఏఁటి॥
పొందైనయాపె యింటిలో బోనము వెట్టుకుండఁగా
విందు నీవేల చెప్పేవే విభునికిని
అందాకె మనసు పెట్టినటువంటి కాఁగిలి-
కిందటనే వాఁడి మిగిలినది గాకా
॥ఏఁటి॥
సేసవెట్టిన మగువ చెఱఁగువట్టుకుండఁగా
ఆసతో నీవెట్టు గూడి యలరితివే
యీసరినే శ్రీవేంకటేశుఁ డిట్టె నన్నుఁ గూడె
వోసరించితే బువ్వము వూరఁబొత్తుగాదా
॥ఏఁటి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము