అధ్యాత్మ సంకీర్తన
రేకు: 161-3
సంపుటము: 2-295
రేకు: 161-3
సంపుటము: 2-295
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| అవధారు పరాకుసేయకు మపరాధముగా నెంచకు వివరింపఁగ నీవే గతి విష్ణుఁడ మన్నించఁ గదే | ॥పల్లవి॥ |
| నాకునాకే నీసన్నిధానము గల్పించుకొని చేకొని విన్నపములెల్లాఁ జేయుచున్నాఁడను కాకుసేసి నన్ను వీఁ డెంత గట్టువాయ యనక శ్రీకాంతా నీ వింతట నుందువు చిత్తగించి వినవే | ॥అవ॥ |
| చూచిచూచి నీమూరితి నాసొమ్ముగఁ జేసుకొని చేచేత నాలో ధాన్యము సేయుచున్నాఁడను కాచుకొని వీనికి నాకూఁ గారణ మేమనక యేచోటా నీరూపమే హరి యెదలోనుండఁ గదే | ॥అవ॥ |
| కోరికోరి నేనూరక నీకొలువు గడించుకొని చేరి నీవూడిగములు సేయుచున్నాఁడను యీరీతులు శ్రీవేంకటేశ్వర యివి యేఁటిసలిగె లనక నారాయణ సర్వేశ్వరుఁడవు నన్ను నేలఁ గదవే | ॥అవ॥ |


