Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 161-4
సంపుటము: 2-296
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
ఎట్టు సేయఁగలవాఁడవో యిఁక నీచేతిది నావునికి
నెట్టన నీదాఁసుడనైతిని నీచిత్తం బిఁకను
॥పల్లవి॥
సారెకుఁ గొలువు‌సేతు చనవులు నీ విత్తువో యనుచు
నేరకున్నాఁ బాడుదును నీవు మెత్తువనుచు
వోరిచి వుపవాసములుండుదు నొగి దయదలంతువో యనుచు
చేరి వాకిలి గాచుకుండుదు చిత్తము రావలెననుచు
॥ఎట్టు॥
కమ్మటి నిచ్చకములు నెరపుదు కైవసము గావలె ననుచు
వుమ్మడి నీగుణాలు వొగడుదు వూరక మొగమోడుదు వనుచు
నెమ్మది మొక్కులు నే మొక్కుదు నేరములెంచక కాతువని
నమ్మి నిన్ను నేఁ బూజింతు నను నీ వీడేరింతువని
॥ఎట్టు॥
ఆసతో నిను భావింతు అన్నిట నన్నేలుదు వనుచు
వేసరక నీమంత్రము నడుగుదు వేగమే వరమొసఁగుదు వనుచు
రాసికి నెక్కఁగ శ్రీవేంకటేశా రక్షించితి విప్పుడు నన్ను
వాసితోడ నే నిన్నుఁ దగులుదును వదలక నాపాలఁ గలవనుచు
॥ఎట్టు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము