అధ్యాత్మ సంకీర్తన
రేకు: 162-1
సంపుటము: 2-297
రేకు: 162-1
సంపుటము: 2-297
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గౌళ
| ఇటులైతేఁ బుణ్యము నీకు యిది వుపకారంబౌను తటుకన నీ కీరితి వొగడుదురు తలకొని యిందరును | ॥పల్లవి॥ |
| సురాసురగంధర్వయక్షులు మిమ్ముఁ దెలియఁగలేరు పరాశరాదులు మీరూపు భావించఁగలేరు నరు లెరుఁగుదురా మిమ్ము నారాయణ నీవే సులభఁడవై కరీంద్రుఁ గాచినయటువలెఁ గాతువు గాక | ॥ఇటు॥ |
| సనాతనబహువేదశాస్త్రంబులు మిమ్ముఁ నుతింపలేవు అనంతయజ్ఞంబులు మిమ్ము నటు సాధించఁగలేవు తనూధరు లెంతటివారు దామోదర నీవే అహల్యను వినోదముగఁ గాచినయటువలె వెసఁ గాతువు గాక | ॥ఇటు॥ |
| రమాసతి నీళామహిరామలు మీతలఁ పెఱంగరు సమేతులైన శేషాదులు మీజాడ మీరలేరు తమోమయు లిందరును ధరణిధర శ్రీవేంకటేశ నమోనమో యని మొక్కంగాఁ ననుఁగాతువు గాక | ॥ఇటు॥ |


