Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 162-4
సంపుటము: 2-300
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
ఏది గతి నే నొక్కఁడనే యెందరి కోపుదును
నీదయతో మన్నించఁగదవే నీరజనాభా
॥పల్లవి॥
మోహాంధకారము యెక్కడచూచిన ముంచుకవున్నది
దేహాభిమానము అందుకుఁ దోడు దీకొనివచ్చీని
సాహసభూతము ఘనహింసలకే చాఁపించీఁ జేయి
దాహపుటాసలు వెనకముందరల తరవులువెట్టీని
॥ఏది॥
కోపాగ్నికణములు సారెకుఁ జుట్టుక గుబ్బతిలఁ దొడఁగె
పైపై వయోవికారంబులు చలపట్టుక తిరిగీని
చాపల గర్వము యెవ్వరినైన సాధింపించీని
తీపుల ధనములు మీఁదిమీఁదనే తీదీపులు రేఁచీని
॥ఏది॥
భావజవిలాస మప్పటప్పటికి బలుములు చూపీని
వేవేలు సంపద లెందుచూచినా వేడుకసేసీని
శ్రీవేంకటేశ యలమేల్మంగను చేకొను దేవుఁడా
యీవేళను నన్నేలితివి నిన్నియు తగ వసమయ్యీని
॥ఏది॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము