అధ్యాత్మ సంకీర్తన
రేకు: 163-3
సంపుటము: 2-302
రేకు: 163-3
సంపుటము: 2-302
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| ఇప్పుడే నే నొడఁబడ మరవఁగఁ దగదు జెప్పితి యెల్లనాఁడు నెప్పున నే నెంతకల్లరినైనా నీదాసుఁడనని యందురుగా | ॥పల్లవి॥ |
| మఱతునో తలఁతునో నిన్ను మాఁటల నేతప్పు గలుగునో యెఱఁగక నీదాసులఁజూచి యేమని పలుకుదునో నెఱసిన నాకర్మఫలంబులు నీకు సమర్పణ సేసితిని మఱి నామీఁదట నేరము లెంచక మాధవ నన్నిటు రక్షించవే | ॥ఇప్పు॥ |
| అలతునో సొలతునో నే నీయందు భక్తి సేతునో సేయనో యెలమిని నీకు నివేదించక యేమేమి భుజియింతునో తలఁచేటి నామనసే నీకును ధనముగాఁ గప్పము వెట్టితిని పలుమరు నన్నును తగవుకుఁ దియ్యక పరమాత్మా ననుఁ గావఁగదే | ॥ఇప్పు॥ |
| నేరనో నేర్తునో నీకైంకర్యము నేమము లేమేమి మానితినో నీరూపము నే సేవించి యెక్కడ నే ననుమానించితినో మేరతోడ మావారు చెప్పఁగా మిమ్మింతట నే నమ్మితిని వారిఁ జూచైన శ్రీవేంకటేశా వరదుఁడవై మము మన్నించఁ గదవే | ॥ఇప్పు॥ |


