అధ్యాత్మ సంకీర్తన
రేకు: 163-6
సంపుటము: 2-305
రేకు: 163-6
సంపుటము: 2-305
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| ఇటు నిను దెలియఁగ ఎంతటివారము తటుకున నాసలఁ దగులుట గాక | ॥పల్లవి॥ |
| నానామూర్తులు నగధర నీరూపు యే నెలవుల నిన్నెటువలెఁ దలఁచుట పూని నీ భావము పొందుగాఁ జెప్పఁగా వీనులు చల్లఁగా వినుటే కాక | ॥ఇటు॥ |
| పెక్కు నామములు బిరుదు లనంతము- లెక్కడ గొలదిగ నెన్నెని పొగడుట యిక్కువ సేసుక యిందులో నొకటి పక్కన నొకమరి పలుకుట గాక | ॥ఇటు॥ |
| వేవేలు గలవు నీ విహార భూములు యేవిధమున నెందెందని తిరుగుట శ్రీవేంకటేశా నీ శృంగారమెల్లను సేవించి ముదమునఁ జెలఁగుట గాక | ॥ఇటు॥ |


