Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 164-2
సంపుటము: 2-307
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
దేవ నీవు గల్పించిన తెరువు లివి
నీవారైనవారి నేరుపులివి
॥పల్లవి॥
పరమశాంతునకుఁ బాపము రాదు
విరతిగలవానికి వెరపు లేదు
గురుసేవారతునకుఁ గోపము రాదు
ధర సత్యవిదునకుఁ దప్పు లేదు
॥దేవ॥
పుట్టు బ్రహ్మచారికి బుద్ధి చెడదు
అట్టె ఆసలేనివారికి అలపు లేదు
తొట్టిన సుజ్ఞానికి దుఃఖములేదు
గట్టియైన మౌనికి కలహమే లేదు
॥దేవ॥
సమచిత్తునకును చంచలము గాదు
విమలాచారునకు వెలితి లేదు
నెమకి శ్రీవేంకటేశ నీదాసులై కొల్చి
భ్రమయనివారికి భారము లేదు
॥దేవ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము