Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 166-4
సంపుటము: 2-320
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
హరి హరి జగమెఱుంగ నీ వాతుమలోనే వున్నాఁడవు
సురలఁ గాచుటయు నసురల నడఁచుట చొప్పడియున్నది నీగురుతు
॥పల్లవి॥
వేదార్థము దప్పందెలిసిన విద్వాంసునివంటిది
పాదుగఁ జదువక తర్కించఁబోవు పాండిత్యమువంటిది
మేదిని నడవులఁ దెరువుదప్పి మరి మెలఁగేటి తెరువరివంటిది
ఆదిమూర్తి నీశరణుచొచ్చి నిను నారాధించనివాని బదుకు
॥హరి॥
వట్టిజోలితో నూరక దేవరలేని పూజవంటిది
వొట్టుక ఫలములులేని పంటలకు వొడిగట్టేయటువంటిది
నెట్టనఁ గర్ణదారుండులేని జలనిధినడిమియోడవంటిది
బట్టబయటనే పరమేశ్వర నీపై భక్తిలేనివాని బదుకు
॥హరి॥
పొందుగ ధర్మముబోధించెడి సత్పురుషులులేని సభవంటిది
చెంది శ్రీవేంకటేశ్వర నీమహిమలు చెప్పని కథవంటిది
సందడి నన్నియుఁ జేసి దక్షిణలు చాలని యజ్ఞము వంటిది
యిందిరారమణ నీవెక్కుడనుచు నిన్నిటఁ దెలియనివాని బదుకు
॥హరి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము