అధ్యాత్మ సంకీర్తన
రేకు: 167-3
సంపుటము: 2-324
రేకు: 167-3
సంపుటము: 2-324
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మలహరి
| అన్నిటా నీవే వుందునందువు గాన యిన్ని నీవు పుట్టించిన వివి నీసొమ్ములే | ॥పల్లవి॥ |
| నిలిచిన రూపులెల్లా నీగుళ్లుగాఁ దలఁతు మెలఁగేటి చైతన్యము మిమ్ముగాఁ దలఁతు యిలలోని ధ్వనులు నీపలుకులుగాఁ దలఁతు సకల పంచభూతా లుపకరణాలుగాఁ దలఁతు | ॥అన్ని॥ |
| నారుకొన్న పంటలు నీనైవేద్యాలుగాఁ దలఁతు నీరెల్లా నీతీర్థమని నెమ్మిఁదలఁతు ధారుణి భోగాలు పూజాద్రవ్యాలుగాఁ దలఁతు నేరిచిన పనులెల్లా నీలీలలుగాఁ దలఁతును | ॥అన్ని॥ |
| కాలత్రయము నీగతులుగానే తలఁతు చాలి సురల నీయనుచరులఁగానే తలఁతు నాలోని శ్రీవేంకటేశ నాతండ్రివని తలఁతు తాలిమి నీదేవులను తల్లియని తలఁతును | ॥అన్ని॥ |


