Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 167-4
సంపుటము: 2-325
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మలహరి
అందుకే పో నీపై నాసపుట్టి కొలిచేది
మందలించితి నిఁక మరి నీచిత్తము
॥పల్లవి॥
యిందరుఁ జెప్పఁగా వింటి యెవ్వరికైనా విష్ణుఁడే
కందువ మోక్ష మియ్యఁ గర్త యనఁగా
ముందే వింటి నారదుఁడు ముంచి నిన్నుఁ బాడఁగా
పొందుగ లోకములోనఁ బూజ్యుఁడాయననుఁచు
॥అందు॥
అప్పటి వింటి లోకములన్నిటికి హరియే
కప్పి రక్షకత్వానకుఁ గర్త యనఁగా
యిప్పుడే వింటి ధ్రువుఁడు యిటు నిన్ను నుతించే
వుప్పతిల్లి పట్ట మేలుచున్నాఁడనుచును
॥అందు॥
యిదె వింటి శ్రీవేంకటేశ బ్రహ్మకుఁ దండ్రివై
కదిసి పుట్టించఁ బెంచఁ గర్త వనుచు
వదలక వింటి నీకు వాల్మీకి కావ్యము చెప్పి
చెదర కాద్యులలోఁ బ్రసిద్ధుఁ డాయననుచు
॥అందు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము