అధ్యాత్మ సంకీర్తన
రేకు: 167-6
సంపుటము: 2-327
రేకు: 167-6
సంపుటము: 2-327
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భూపాళం
| చెప్పవే నన్ను మన్నించి శ్రీపతి నాకు యెప్పుడును జింతించే నిదే పనై నేను | ॥పల్లవి॥ |
| పొలసి నీరూప మెట్టు పొడచూపేవో యెలమి నాభాగ్య మిఁక నెట్టున్నదో అలరి నా కేబుద్ధి ఆనతిచ్చేవో కలిగిన నీమాయ యేగతిఁ గడచేనో | ॥చెప్ప॥ |
| వరుస నా కెట్లాఁ గైవసమయ్యేనో యిరవై నాజన్మఫల మెట్టున్నదో పరగ నామతి నెట్టు పాయకుండేవో కరుణానిధివి నిన్నే కరణి మెప్పించేనో | ॥చెప్ప॥ |
| పనివడి యెట్లా నీభక్తి యిచ్చేవో నా- మనసు చంచల మెట్టు మట్టుపడీనో యెనలేని నాతలఁపు యెఱిఁగి శ్రీవేంకటేశ నను నేలితివి యెట్లా నాకోరిక చెల్లీనో | ॥చెప్ప॥ |


