Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 169-6
సంపుటము: 2-338
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
దాఁచుకో నీపాదాలకుఁ దగ నేఁ జేసిన పూజలివి
పూఁచి నీ కీరితిరూపపుష్పము లివియయ్యా
॥పల్లవి॥
వొక్క సంకీర్తనే చాలు వొద్దికై మమ్ము రక్షించఁగ
తక్కినవి భండారాన దాఁచివుండనీ
వెక్కసమగు నీ నామము వెల సులభము ఫలమధికము
దిక్కై నన్నేలితివిఁక నవి తీరని నా ధనమయ్యా
॥దాఁచు॥
నా నాలికపైనుండి నానా సంకీర్తనలు
పూని నాచే నిన్నుఁ బొగడించితివి
వేనామాల వెన్నుఁడా వినుతించ నెంతవాఁడ
కానిమ్మని నాకీ పుణ్యము గట్టితి వింతేయయ్యా
॥దాఁచు॥
యీమాఁట గర్వముగాదు నీమహిమే కొనియాడితిఁ గాని
చేముంచి నా స్వాతంత్ర్యము చెప్పినవాడఁ గాఁను
నేమానఁ బాడేవాఁడను నేరములెంచకుమీ
శ్రీమాధవ నే నీ దాసుఁడ శ్రీవేంకటేశుఁడవయ్యా
॥దాఁచు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము