అధ్యాత్మ సంకీర్తన
రేకు: 170-1
సంపుటము: 2-339
రేకు: 170-1
సంపుటము: 2-339
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
| హరి గోవిందా హరి గోవిందా - ఆనంద మానంద మాతుమకును గురూపదేశాన వెదకఁగా వెదకఁగా - గరిమ నీయర్థము కంటిమో యయ్యా | ॥పల్లవి॥ |
| హరి నన్యధర్మములు మానుమంటివి - శరణు నీకుఁ జొరుమంటివి దురితము లణఁచేనంటివి - పరగ మోక్షం బిచ్చేనంటివి హరి నీవచనము అమోఘము - నరులము నే మిది నమ్మితిమి పరమపద మిప్పుడే కలిగేను- ధర నొక్కమనసుతో నున్నారమయ్యా | ॥హరి॥ |
| యెందు నీవే గతి యనుమంటివి - యేచి యొక్కమాఁటే చాలునంటివి యిందరి కభయ మిత్తునంటివి - యిది నీకెపుడు వ్రతమంటివి కందువ నీబిరుదు సత్యము - కానిమ్మని నేము చేపట్టితిమి అంది నీవే మాకు దిక్కైతివి - అన్నిటా సంతోసాన నున్నారమయ్యా | ॥హరి॥ |
| ఆస మానినవాఁడెక్కు డంటివి- ఆతనివెంటఁ దిరిగేనంటివి భాసురపాదరేణువు నే నంటివి- పావన మయ్యేనని యంటివి మోసలేనిది నీసంకల్పము -మొక్కే మిందులకు శ్రీవేంకటేశా ఆసపడ నితరుల నాకు నీవే యాస - యని నీదాసులమై యున్నారమయ్యా | ॥హరి॥ |


