Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 171-3
సంపుటము: 2-346
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుజ్జరి
ఒకటి కొకటి లంకై వూరకైనాఁ బెనగొను
అకటా యెవ్వరు దాఁటేరయ్య నీమాయలు
॥పల్లవి॥
తనయెదుటివెల్లాను తలఁపులోఁ బారును
మనసులోపలివెల్లా మర్మము లంటు
ఘనమర్మములు రేఁగి కాయమెల్లాఁ గరఁగించు
తనువుసౌఖ్య మవ్వలి తనువున నంటును
॥ఒక॥
అవ్వలిదేహభోగము లట్టే కర్మములౌను
మువ్వంకఁ గర్మాలు లోకములై చెందును
చివ్వన నాలోకములు చేరి కాలము గడపు
తెవ్వనికాలము నిద్రాఁ దెలివినై ముంచును
॥ఒక॥
వెస నాతెలివి యొకవేళ నిన్నెఱిఁగించు
వసమై ఆయెఱుకకు వచ్చి మెత్తువు
యెసగి నీవు మెచ్చితే యిహపరము లిత్తువు
మిసిమి శ్రీవేంకటేశ మెరయు నీయీవి
॥ఒక॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము