Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 173-1
సంపుటము: 2-356
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మలహరి
ఎఱిఁగినవారికి హింస లిన్నియు మాని
మఱి సత్యమాడితేను మాధవుఁడే దిక్కు
॥పల్లవి॥
కలుగుఁ గారణములు కామక్రోధములు రేఁగ
వెలసిన మాయవికార మది
కలఁగఁగ వలనదు కర్త లెవ్వరుఁ గారు
తెలిసి వోరుచుకొంటే దేవుఁడే దిక్కు
॥ఎఱిఁ॥
పదార్థా లెదుట నిలుచుఁ బంచేంద్రియాలు రేఁగ
వెదచల్లేటి మాయావికార మది
పదరి పైకొనవద్దు పట్టితేఁ బసలేదు
చెదరక వోరిచితే శ్రీపతే దిక్కు
॥ఎఱిఁ॥
సిరులు తానే వచ్చే చిత్తాన నాసలు రేఁగ
విరసపు మాయావికారమది
పరగ నలమేల్మంగపతి శ్రీవేంకటేశ్వరు
శరణంటే నితని చరణాలే దిక్కు
॥ఎఱిఁ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము