Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 175-1
సంపుటము: 2-369
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేవగాంధారి
సదానందము సర్వేశ్వర నీ-
పదారవిందముపై భక్తి
॥పల్లవి॥
నయనానందము నరులకు సురులకు
జయమగు హరి నీసాకారము
నయమగు శ్రవణానందము వినినను
క్రియగలిగిన నీకీర్తనము
॥సదా॥
చెలఁగి యందరికి జిహ్వానందము
పలుమరుఁ గొను నీపస్రాదము
నలుగడ దేహానందము బుధులకు
బలు నీపాదప్రణామమములు
॥సదా॥
ధరఁ బరమానందము నీదాస్యము
గరిమల శ్రీవేంకటవిభుఁడా
నరహరి నిత్యానందము నినుఁ దగ-
నరవిరిఁ జేయు సమారాధనము
॥సదా॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము