Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 175-5
సంపుటము: 2-373
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాదరామక్రియ
నేనేమెరిఁగి సేసేనో నీకుఁ దిరువారాధన
ఆని మున్నిటి బ్రహ్మరుద్రాదులు సేయఁగలేరు
॥పల్లవి॥
అనుగు నీరూప మింతంతనెరిఁగి సేసేనో
వునికై నీ వొక్కచోనే వుండేదెరిఁగి సేసేనో
తనిసి నీకు నొక్కమంత్రమునెరిగిఁ సేసేనో
కనరాని నీమహిమే కడయెరిఁగి సేసేనో
॥నేనే॥
మరిగి నీకు నొక్కనామమునెరిఁగి సేసేనో
అరసి యించుకేకాలమనెరిఁగి సేసేనో
నిరతి నీకేమి లేవని యెరిగి సేసేనో
బెరసి నన్ను గొంత మెప్పించనెరిగి సేసేనో
॥నేనే॥
తెలిసి నీకు నొక్కమూర్తియనెఱిఁగి సేసేనో
అలమిన నీమాయఁ గొంతనెరిఁగి సేసేనో
అలమేల్మంగకుఁ బతియగు శ్రీవేంకటేశుఁడ
వొలసి నీ కుపమింప నొక్క టెరిఁగి సేసేనో
॥నేనే॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము