అధ్యాత్మ సంకీర్తన
రేకు: 176-1
సంపుటము: 2-375
రేకు: 176-1
సంపుటము: 2-375
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| జగన్మోహనాకార చతురుఁడవు పురుషోత్తముఁడవు వెగటు నా సోదంబు ఇది నీ వెలితో నా వెలితో | ॥పల్లవి॥ |
| యెన్నిమారులు సేవించినఁ గన్నులూ దనియవు విన్న నీకథామృతమున వీనులుఁ దనియవు సన్నిధిని మిమ్ము నుతియించి సరుస జిహ్వయుఁ దవియదు విన్న కన్నది గాదు ఇది నావెలితో నీవెలితో | ॥జగ॥ |
| కడఁగి నీప్రసాదమే కొని కాయమూఁ దనియదు బడిఁ బ్రదక్షిణములుసేసి పాదములు నివిఁ దనియవు నుడివి సాష్టాంగంబు చేసి నుదురునూఁ దనియదు వెడఁగుఁదన మిది గలిగె నిది నావెలితో నీవెలితో | ॥జగ॥ |
| చెలఁగి నిను నేఁ బూజించి చేతులూఁ దనియవు చెలువు సింగారంబు దలఁచి చి త్తమూఁ దనియదు అలరి శ్రీవేంకటగిరీశ్వర అత్మ నను మోహించఁజేసితి వెలయ నిన్నియుఁ దేరే మును నీవెలితో నావెలితో | ॥జగ॥ |


