Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 177-4
సంపుటము: 2-384
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుజ్జరి
ఉపకారి దేవుఁడు అపకారి గాఁడు॥పల్లవి॥
దేహం బొసఁగెను దేవుఁడు తనుఁ దెలియఁగ శాస్త్రము గడియించె
దేహాంతరాత్ముఁడు మరి దేహచైతన్యుఁడా దాను
దేహి యేలోకంబున కేఁగిన దేవుఁడు దా వెంటనే యేఁగును
దేహి కోరినట్టే కమ్మర దేవుఁ డనుమతి ఇచ్చీఁ గాన
॥ఉప॥
చేయుటకును చేయకమానుటకును జీవుఁడు స్వతంత్రుఁడా యంటేను
కాయపుసుఖములు గోరఁగ గర్తట కడగనుటకుఁ గర్త గాఁడా
యీయెడ నాయెడ నంతర్యామే యిన్నిటికినిఁ బ్రేరకుఁడింతే
దాయక పాయక తనతలఁపుకొలఁది దైవమే సృజియించీఁ గాన
॥ఉప॥
ఇవి యెరిఁగి చిత్తమా నీ వితనందే అభిరతి సేయుము
సదయుఁడు మనశ్రీవేంకటగిరి సర్వేశ్వరుఁడు సత్యుఁడు
మొదలనే యీయర్థము కిరీటితో మొగి నానతి ఇచ్చినాఁడు
అదే "నమోఽహం సర్వభూతేషు" అని గీతలలో నున్నది గాన
॥ఉప॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము