Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 2-3
సంపుటము: 1-9
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
ఎవ్వరిఁ గాదన్న [1]నిది నిన్నుఁ గాదంట
యెవ్వరిఁ గొలిచిన [2]నిది నీకొలువు
॥ఎవ్వరి॥
అవయవములలో నదిగా దిదిగా-
దవి మేలివి మేలననేలా
భువియుఁ బాతాళము దివియు నందలి జంతు-
నివహ మింతయునూ నీదేహమే కాన
॥ఎవ్వరి॥
నీవు లేనిచోటు నిజముగఁ దెలిసిన
ఆవల నది గా దనవచ్చును
శ్రీవేంకటగిరి [3]శ్రీనాథ సకలము
భావింప నీవే పరిపూర్ణుఁడవు గాన
॥ఎవ్వరి॥

[1][2] ‘నది’ అని పూ.ము.పా. ‘అది’ అని రేకు. యతిభంగము.

[3] ‘శ్రీనాధ’ అని రేకు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము