Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 184-4
సంపుటము: 2-424
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
కలుగుట గలిగిననాఁడే నే ఘనపాపములకు దొలంగీనా
యెలమి నే నిపుడే యెరిఁగితిని యిన్నాళ్లీమతి లేదు
॥పల్లవి॥
జనియించిన నే నిటకమునుపు సకలయోనిగతజన్మములు
కనుఁగొని యవె నే సారెకుఁ బలుమారు ఘనవర్ణాశ్రమధర్మములు
అనుభవించినవే సకలార్థంబులు అయిహికవిషయము లన్నియును
మనసున వాకున శ్రీహరి నొకని నే మఱచియుఁ దలఁచుట లేదు
॥కలు॥
తిరిగినవే నే నాసలకొరకును దిక్కు లన్నియును నేను
యిరవుగ తొల్లియు నెఱిఁగినవే యీసంసారపుసుఖము లివి
పొరలినవే నేఁ గామినీజనుల పొందుల సుఖముల భోగములు
యెరవులదొకటే శ్రీహరిదాస్యం బిది గతియని యెరుఁగుటలేదు
॥కలు॥
గడియించినవే నేఁ బూర్వకాలమున ఘనమగు సంపద లిన్నియును
నొడిగినవే నే శబ్దజాలములు నోరఁ గొలఁదు లివి యిన్నియును
తలఁబడి నే నిటు సకలోపాయపు ధర్మము లిన్నియుఁ జూచితివి
యెడపక శ్రీవేంకటేశ్వరు శరణం బిటువలెఁ జేరుటలేదు
॥కలు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము