అధ్యాత్మ సంకీర్తన
రేకు: 184-5
సంపుటము: 2-425
రేకు: 184-5
సంపుటము: 2-425
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| నీ వొక్కఁడవే నాకుఁ జాలు నీరజాక్ష నారాయణ నీవే నాకు గతియని తెలిసితి నెక్కొని యితరము వృథా వృథా | ॥పల్లవి॥ |
| మీ నామోచ్చారణమే మెరసిన దుఃఖనివారణము మీ నామోచ్చారణమే మెలఁగు శుభకరము నానావేదశాస్త్రములు నవపురాణేతిహాసములు మీ నామములోనే వున్నవి మిగిలిన విన్నియు వృథా వృథా | ॥నీవొ॥ |
| నీ పాదమూలము నింగియు భువియు రసాతలము నీ పాదమూలము నిఖిలజీవపరిణామములు దీపించిన చరాచరంబులు దివ్యులు మునులును సర్వమును నీ పాదమూలమే మరి నెరి నితరంబులు వృథా వృథా | ॥నీవొ॥ |
| దేవ మీతిరుమేను దిక్కును బ్రహ్మాండాధారము దేవ మీతిరుమే నుత్పత్తిస్థితిలయములకును ఆకరము శ్రీవేంకటపతి నాభావము చిత్తము నీకే సమర్పణ దేవ మీశరణము చొచ్చితి దిక్కులన్నియును వృథా వృథా | ॥నీవొ॥ |


