అధ్యాత్మ సంకీర్తన
రేకు: 186-2
సంపుటము: 2-433
రేకు: 186-2
సంపుటము: 2-433
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
| నేనేమిఁ జేయఁగలేను నీవు పరిపూర్ణుఁడవు హీనుఁడ నే నధికుఁడ విన్నిటా నీవు | ॥పల్లవి॥ |
| దండము వెట్టుట నాది తప్పు లోఁగొనుట నీది నిండి నీవెప్పుడు దయానిధివి గాన అండఁ బేరుకొంట నాది అందుకు నూఁకొంట నీది దండియైన దేవదేవో త్తముఁడవు గాన | ॥నేనే॥ |
| శరణు చొచ్చుట నాది సరుగఁ గాచుట నీది పరమ పురుష శ్రీపతివి నీవు విరులు చల్లుట నాది వేవేలిచ్చుట నీది పొరి నీవు భక్తసులభుఁడ వటుగాన | ॥నేనే॥ |
| దాసుఁడననుట నాది తప్పక యేలుట నీది ఆసదీర్చే వరదుఁడ వటుగాన నీసేవ యొక్కటి నాది నిచ్చలుఁ గైకొంట నీది యీసులేని శ్రీవేంకటేశుఁడవు గాన | ॥నేనే॥ |


