అధ్యాత్మ సంకీర్తన
రేకు: 188-1
సంపుటము: 2-444
రేకు: 188-1
సంపుటము: 2-444
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
| నీవే సేసిన చేఁత నీవే చేకొనుటింతే యీవల నీసొమ్ము నీకే ఇయ్య సిగ్గయ్యీనయ్యా | ॥పల్లవి॥ |
| అలుబిడ్డలఁ గని యటు దనమగనికి సీలాన సమర్పణ సేయవలెనటవయ్యా తాలిమిఁ బుణ్యాలు సేసి దైవమా నే నీకు యేలీల సమర్పించే నిందుకే నవ్వు వచ్చీనయ్యా | ॥నీవే॥ |
| అంకెలఁ గన్నకొడు కటు దమతండ్రికిని తెంకి నే నీవాఁడ నని తెలుపఁగవలెనటవయ్యా లంకె నాలోపలనున్నలక్ష్మీశ నే నీకు పొంకపు నీబంట నన్నఁ బునరుక్తయ్యీనయ్యా | ॥నీవే॥ |
| తననీడ యద్దములోఁ దానే యటు చూచి పనివడి వూరకే భ్రమయవలెనటయ్యా అనుగు శ్రీవేంకటేశ ఆతుమలోనున్న నిన్ను గని మని శరణంటిఁ గడఁ బూజించనేలయ్యా | ॥నీవే॥ |


